- మార్చి 14 నుంచే ఎస్ఎస్సీ పరీక్షలు
- సెంటర్లలోకి మొబైల్స్, ఎలక్ట్రానిక్ పరికరాలకు నో ఎంట్రీ
- కేంద్రాల వద్ద క్లాక్‌రూమ్ ఫెసిలిటీ
- సీసీ టీవీ నిఘాలో ఎగ్జామ్స్
హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి ఫైనల్ ఎగ్జామ్స్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్షలు శనివారం నుంచి ఏప్రిల్16 వరకు జరగనున్నాయి. జిల్లాలోని 1,433 స్కూళ్లకు చెందిన 74,371 మంది రెగ్యులర్ విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని డీఈఓ రోహిణి తెలిపారు. వీరిలో 37,982 మంది బాయ్స్, 36,389 మంది గర్ల్స్ఉన్నారన్నారు. వీరి కోసం 362 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. ఒకసారి ఫెయిల్ అయిన ప్రైవేట్ అభ్యర్థులు 4,094 మంది కూడా ఈసారి పరీక్షలు రాయనున్నారు. నిర్వహణ కోసం 362 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 362 మంది డిపార్ట్మెంటల్ అధికారులు, 14 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు, 3,983 మంది ఇన్విజిలేటర్లను నియమించారు.
సీసీ టీవీల పర్యవేక్షణ
పరీక్షా కేంద్రాల్లో పారదర్శకత కోసం సీసీటీవీ నిఘా ఏర్పాటు చేశారు. 284 కేంద్రాల్లో చీఫ్ సూపరింటెండెంట్ గదుల్లో ఇప్పటికే పర్మినెంట్ సీసీటీవీ కెమెరాలుండగా, మిగిలిన 78 కేంద్రాల్లో తాత్కాలిక కెమెరాలు ఏర్పాటు చేశారు. ప్రశ్నాపత్రాల సీల్డ్ కవర్లను సీసీటీవీ పర్యవేక్షణలోనే తెరవనున్నారు. స్టూడెంట్స్ కు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీరు, కుర్చీలు, బెంచీలు, టాయిలెట్స్, వైద్య సదుపాయాలు ఏర్పాట్లు చేశారు. పరీక్షా కేంద్రాల వద్ద మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురావడాన్ని నిషేధించారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, పరీక్షా సిబ్బంది, అధికారులు ఇలా ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదు. పరీక్షా కేంద్రాల ప్రవేశ ద్వారాల వద్ద క్లాక్‌రూమ్ సౌకర్యాన్ని ఏర్పాటు చేసి, విద్యార్థులు తమ మొబైల్ ఫోన్లు, పుస్తకాలు ఇతర వస్తువులను భద్రపరుచుకునే ఏర్పాట్లు చేశారు.
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
టెన్త్ ఎగ్జామ్స్ రాయనున్న స్టూడెంట్ల కోసం ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ జోన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఉదయం 8.45 గంటల్లోపు స్టూడెంట్స్ఎగ్జామ్ సెంటర్లకు చేరుకునేలా అవసరమైన బస్సులు నడపనున్నారు. పరీక్ష రాశాక తిరిగి వెళ్లేందుకు కూడా ప్రత్యేకంగా బస్సులు నడపనున్నారు. దీని కోసం బస్ స్టేషన్లలో హెల్ప్‌డెస్క్‌లు ఏర్పాటు చేసి సూపర్వైజర్లను నియమించారు.
హాల్‌టికెట్, బస్‌పాస్ ఉంటే ఎంత దూరమైనా ఫ్రీ
పరీక్షలకు హాజరయ్యే బాయ్స్ఎగ్జామ్ సెంటర్స్‌కు వెళ్లి తిరిగి రావడానికి హాల్ టికెట్ తో పాటు కన్సెషన్ బస్ పాస్ ఉంటే ఎంత దూరమైనా ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. ఒకవేళ స్టూడెంట్ వద్ద కన్సెషన్ బస్‌పాస్ లేకపోతే సాధారణ చార్జీ తీసుకుని టికెట్ ఇస్తామన్నారు. ఏప్రిల్16 వరకు మాత్రమే బాలురకు ఈ ఉచిత ప్రయాణం అందుబాటులో ఉంటుందన్నారు. స్టూడెంట్లకు ఏవైనా సహాయం అవసరమైతే జోనల్ కమ్యూనికేషన్ సెల్ ఫోన్ నెంబర్ 9959226160 (జేబీఎస్ అధికారి)ను సంప్రదించాలని సూచించారు.
